Nara Lokesh: ముగిసిన నారా లోకేష్ విచారణ.. ఆరు గంటల పాటు ప్రశ్నించిన సీఐడీ

By :  Kiran
Update: 2023-10-10 13:35 GMT

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ బాబు విచారణ ముగిసింది. ఏపీ సీఐడీ అధికారులు దాదాపు ఆరు గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. బుధవారం మళ్లీ విచారణకు రావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో సీఐడీ అధికారులు నారా లోకేష్ ను 50 ప్రశ్నల వరకు అడిగినట్లు తెలుస్తోంది. చాలా ప్రశ్నలకు ఆయన సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం.

మరోవైపు సీఐడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ .. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుతో సంబంధం లేని అనేక ప్రశ్నలు అడిగారని చెప్పారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్ స్కాంకు సంబంధించి ఎలాంటి ఆధారాలు తన ముందు పెట్టలేదని అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో తానుగానీ, తన కుటుంబసభ్యులుగానీ ఎలా లాభపడ్డారన్న దానిపై ఒక్క ప్రశ్న కూడా వేయలేదని నారా లోకేష్ చెప్పారు. ఇదంతా కక్షసాధింపే తప్ప ఎలాంటి ఆధారాలు లేని కేసు అని అభిప్రాయపడ్డారు. బుధవారం పనులున్నాయని, ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎంత సమయమైనా సరే ఇవాళే అడగాలని.. కోరినట్లు లోకేష్ చెప్పారు. అయితే సీఐడీ అధికారులు మాత్రం బుధవారం మరోసారి విచారణకు రావాలంటూ తనకు మరోసారి 41 ఏ నోటీసులు ఇచ్చారని అన్నారు. బుధవారం కూడా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు స్కాం కేసులో ఏపీ సీఐడీ చంద్రబాబు నాయుడును ఏ1గా.. ఏ2గా మాజీ మంత్రి నారాయణ , ఏ6గా హెరిటేజ్‌ సంస్థ , ఏ14గా నారా లోకేష్‌ పేర్లు చేర్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం లోకేష్‌ పిటిషన్‌ వేయగా.. ఏపీ హైకోర్టు దానిని కొట్టేసింది. విచారణకు సహకరించాలని లోకేష్‌కు సూచిస్తూనే.. మరోవైపు 41ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాలని సీఐడీ పోలీసులకు ఆదేశించింది. ఈ క్రమంలో అక్టోబర్ 10 వరకు లోకేష్ను అరెస్ట్ చేయొద్దని కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో ఆయన సీఐడీ విచారణకు హాజరయ్యారు.

Tags:    

Similar News