AP CM YS Jagan:చేయలేనివి చెప్పకూడదు మాట ఇస్తే తప్పకూడదు..

Byline :  Veerendra Prasad
Update: 2024-02-06 13:05 GMT

చంద్రబాబు కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తారని, వాగ్దానాలు అమలు చేసిన చరిత్ర చంద్రబాబుకి లేదన్నారు ఏపీ సీఎం జగన్. మంగళవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ... మనసు లేని నాయకుడు.. మోసం చేసే నాయకుడు చంద్రబాబు అని అన్నారు. "చేయలేనివి చెప్పకూడదు.. మాట ఇస్తే తప్పకూడదు. మాట మీద నిలబడ్డాం కాబట్టే ప్రజలు 151 స్థానాలు కట్టబెట్టారు. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు గెలిపించి గుండెల్లో పెట్టుకున్నారు. విశ్వసనీయతకు అర్థం జగనే. విశ్వసనీయత ఎప్పటికైనా గెలుస్తుంది. 99 శాతం హామీలు అమలు చేశాం. జరిగిన మంచిపై ప్రతి ఇంటా చర్చ జరగాలి" అని అన్నారు.

" ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు వాగ్ధానాలు ఉంటాయి. మనం ఏడాదికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తే.. శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు కొత్త వాగ్ధానాలకు ఏడాదికి రూ.73 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటివరకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కలుపుకుంటే రూ.2 లక్షల 26 వేల 140 కోట్లు ఖర్చు అవుతుంది. మరి అప్పుడు రాష్ట్రం ఏమవుతుంది? మనం రూ.70 వేల కోట్లకే చాలా కష్టాలు పడుతూంటే బాబు రూ.1.26 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం సాధ్యమేనా? ఇలా మోసం చేయడం, కుట్రలు పన్నడం ధర్మమేనా బాబు!. సంపద సృష్టించానని బాబు ప్రతీ మీటింగ్‌లో చెబుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో రెవెన్యూ లోటు. బాబు సంపద సృష్టిస్తే.. రెవెన్యూ లోటు ఎందుకు వస్తుంది?. చంద్రబాబు కంటే మన హయాంలోనే ఎక్కువ సంపద సృష్టించాం" అని అన్నారు.

ప్రభుత్వం మంచి చేయలేదని నమ్మితే.. ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు జగన్. ప్రతిపక్షాల్లో ఏ ఒక్కరు కూడా అధికారం అన్నది ప్రజలకు మంచి చేసేందుకు ఉపయోగించుకోవాలని రావడం లేదన్నారు.ప్రజలను మోసం చేసేందుకు వీళ్లు దోచుకుని, పంచుకునేందుకు మాత్రమే వీళ్లకు అధికారం కావాలన్నారు. మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి తొలగించిన ఘనత చంద్రబాబుదని, పేదలకు మళ్లీ మోసం చేసేందుకు సిద్ధం అయ్యారన్నారు. పక్క రాష్ట్రాల్లోని వాగ్ధాలను మేనిఫెస్టోలో పెడుతున్నాడని, కనీసం పది శాతం హామీలను కూడా నెరవేర్చలేదన్నారు. ఏ మేనిఫెస్టో తీసుకున్నా ఇవే మోసాలు కనిపిస్తాయన్నారు. "నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు. చంద్రబాబు ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. ఎన్నికల ముందు చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో పెద్ద బుక్‌ తెస్తారు. ఎన్నికలయ్యాక మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుంది. ఏ గ్రామానికి వెళ్లినా చంద్రబాబు చేసిందేమీ లేదు. చంద్రబాబు పాలన అధ్వాన్నంగా సాగింది" అని పేర్కొన్నారు జగన్

Tags:    

Similar News