ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. ఇటీవల తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేసుకున్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించనున్నారు. డిసెంబర్ 8న ఫామ్‌హౌజ్‌లోని బాత్‌రూంలో జారి పడటంతో కేసీఆర్ తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. వెంటనే కేసీఆర్‌ను కుటుంబ సభ్యులు యశోదా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యులు పరీక్షించి తుంటి ఎముక ఫ్యాక్చర్ అయ్యిందని ఆపరేషన్ చేయాలని చెప్పారు. అనంతరం యశోదా వైద్యుల ఆధ్వర్యంలో కేసీఆర్‌కు తుండి ఎముక మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వారం పాటు ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిసెంబర్ 15న కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి నందినగర్‌లోని పాత ఇంటికి వెళ్లారు. ఇంట్లో కేసీఆర్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.
అయితే మాజీ సీఎం కేసీఆర్ జగన్‌ల భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ జగన్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి 2018 ఎన్నికల్లో బరిలో దిగడంతో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పడం ఆనాడు సంచలనంగా మారింది. ఇక, ఏపీలో తర్వలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీరి భేటీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.