రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు.. తెలంగాణపై మరోసారి జగన్ అక్కసు

Byline :  Kiran
Update: 2024-02-06 12:18 GMT

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర విభజన సరిగా జరగకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామని అన్నారు. విభజన కారణంగా ఏపీ తలసరి ఆదాయం తగ్గిందని, తెలంగాణతో పోలిస్తే ఏపీ వెనకబడిపోయిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఏటా రూ.13వేల కోట్ల నష్టం కలుగుతోందని జగన్ వాపోయారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా చేర్చలేదని, అందుకే అది ఎండమావిగా మారిందని మండిపడ్డారు.

హైదరాబాద్ను కోల్పోవడం వల్ల ఏపీ చాలా నష్టపోయిందని జగన్ అన్నారు. ప్రతి రాష్ట్రానికి ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలని, పెద్ద నగరాలు ఉంటేనే ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమని చెప్పారు. హైదరాబాద్ లేకపోవడం వల్ల పదేండ్లలో రూ.1.40లక్షల ఆదాయాన్ని కోల్పోయామని అన్నారు. ఏపీకి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలు కావాలన్న జగన్.. అందుకోసమే విశాఖపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు.

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పూర్తి మెజార్టీ రావద్దని కోరుకుంటున్నానని జగన్ అన్నారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల గురించి పట్టించుకుంటుందని చెప్పారు. కేంద్రంలో పూర్తి మెజార్టీ లేకపోతే ఆ ప్రభుత్వానికి రాష్ట్రాల అవసరం ఉంటుందని, అప్పుడు మన డిమాండ్లను సాధించుకోవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

పాలన అనుభవం లేకపోయినా సుపరిపాలన అందిస్తున్నామని జగన్ ప్రకటించారు. లంచాలకు తావులేని వ్యవస్థలు తెచ్చామని అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదని విమర్శించారు. టీడీపీ పాలనలో దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా పరిస్థితి ఉండేదని అన్నారు. చంద్రబాబు కన్నా తక్కువ అప్పులు చేసి ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని జగన్ సభకు వివరించారు. బాబు హయాంలో నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయో అందరికీ తెలుసని అన్నారు. టీడీపీ నేతలు జాతీయ పార్టీలతో అవగాహన కుదుర్చుకుని వైసీపీ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆ అవసరం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబు మరోసారి ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారని, అసలు ఆయనకు ఎందుకు అవకాశం ఇవ్వాలో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News