ఏపీ విద్యుత్ ఉద్యోగుల ఆందోళనలు ఉధృతం.. నిరవధిక సమ్మెకు సిద్ధం
ఏపీ విద్యుత్ ఉద్యోగులు తమ ఆందోలనలను ఉధృతం చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలు విఫలం కావడంతో నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.
బుధవారం అర్ధరాత్రి నుంచి ఏపీ వ్యాప్తంగా ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
తమ సమస్యలను పరిష్కరించాలని గత రెండేళ్లుగా ప్రభుత్వంతో విద్యుత్ సంఘ నేతలు చర్చలు జరుపుతున్నారు. అవి విఫలం అవ్వడంతో జూలై 21 నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చారు. రేపు (ఆగస్టు 9) పెన్ డౌన్, మొబైల్ ఫోన్ డౌన్ చేయనున్నారు. బుధవారం సాయంత్రం లోపు అధికారిక సిమ్ లు ఇచ్చివేయనున్నారు. అత్యవసర సేవలకు మినహాయించి, మిగతా విధులకు హాజరుకావొద్దని నిర్ణయించారు.
సమ్మెలో వాచ్ మెన్ నుంచి ఇంజినీర్ వరకూ అందరూ పాల్గొంటారని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు ప్రకటించారు. ప్రజలకు ఇబ్బంది కలిగితే ప్రభుత్వం, యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. విద్యుత్ ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో విజయవాడలోని విద్యుత్ సౌధతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఆఫీస్ ల వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరికలు చేస్తోంది.