AP Govt:'విధుల్లో హాజరుకాకుంటే అంగన్‌వాడీలపై చర్యలు తీసుకుంటాం'
అంగన్‌వాడీలకు ఏపీ ప్రభుత్వం అల్టీమేటం జారి చేసింది. సమ్మె బాట పట్టిన అంగన్‌వాడీలు.. జనవరి 5 లోపు విధుల్లోకి చేరాలని కలెక్టర్ల ద్వారా నోటీసులు ఇచ్చింది. ఈ సమ్మెతో రాష్ట్రంలోని గర్భిణులు, బాలింతలు, శిశువులు ఇబ్బంది పడుతున్నారని, వారికి పౌష్టికాహారం లభించట్లేదని చెప్పింది. కాబట్టి వీలైనంత త్వరగా విధుల్లోకి చేరాలని, ఒకవేళ విధుల్లోకి హాజరుకాకుంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విధులకు హాజరుకాని వాళ్ల వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసిన అంగన్ వాడీలు
కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్యాట్యుటీ అమలు చేయాలని, ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ రద్దుచేసి పనిభారం తగ్గించాలని అంగన్‌వాడీలు గత 21 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రోజుకో రూపంలో నిరసన తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలను నాలుగున్నరేళ్లయిన నెరవేర్చలేదంటూ అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన నోటీసులతో ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.