Anganwadi Workers Protest : అంగన్వాడీలపై ఎస్మా... జగన్ ఉక్కుపాదం..

Byline :  Lenin
Update: 2024-01-06 08:46 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కన్నెర్రజేశారు. అంగన్వాడీలపై ఉక్కుపాదం మోపారు. జీతాలు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ‘ఎస్మా’ చట్టాన్ని ప్రయోగించారు. అంగన్వాడీలు సమ్మెను విరమించుకోకపోతే ఈ చట్టం కింద కేసులు పెట్టి జైలుకు పంపుతారు. సమ్మె చేసేవారికే కాకుండా, మద్దతిస్తున్నవారికి కూడా కఠిన శిక్షలు పడతాయి. ఇటీవల కాలంలో ఏపీలో ఎస్మాను ప్రయోగించడం ఇదే తొలిసారి. జగన్ నిరంకుశ పాలనకు ఇది పరాకాష్ట అని అంగన్వాడీ కార్యకర్తలు, విపక్షాలు మండిపడుతున్నాయి.

ఏపీ అంగన్వాడీలు 26 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయి. ఎన్నికలు దగ్గర్లో ఉండడంతో సమ్మె కారణంగా దెబ్బతింటామని జగన్ భావిస్తున్నారు. అంగన్వాడీలతో చర్చలు విఫలం కావడంతో ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు. ఆరు నెలల పాటు సమ్మెను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కింద తీసుకొస్తూ జీవోను విడుదల చేసింది. సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత పెట్టిది. 3 వేలు రూపాయలు తగ్గించి 8 వేలు మాత్రమే ఖాతాల్లో వేసింది.

ఎస్మా చట్టం రావడంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది అంగన్వాడీ కార్యర్తలపై కేసులు పెట్టి జైలుకు పంపనున్నాయి. ఎస్మా చట్టాన్ని ఉల్లంఘించి తమ ఉద్యమం కొనసాగిస్తామని అంగన్వాడీలు తేల్చి చెబుతున్నారు. ఎస్మా చట్టాలన్ని విధిలేని పరిస్థితిలో మాత్రమే ప్రభుత్వాలు ప్రయోగిస్తుంటాయి. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటి చట్టమని, దీన్ని రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తుంటాయి. అత్యవసర సేవలు అందించే ఉద్యోగుల నోళ్లు కట్టేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.

ఎసెన్సియల్‌ సర్వీసెస్‌ మెయిన్‌టెనెన్స్‌ యాక్ట్‌ను ఎస్మా అని క్లుప్లంగా పిలుస్తుంటారు. ప్రజల దైనందిన జీవితానికి ఇబ్బంది కలిగించే సమ్మెలు, నిరసనలను అణచేయడం దీని ఉద్దేశం. 1981లో దీన్ని అమల్లోకి తేసుకొచ్చారు. ఎస్మాను ఉల్లంఘిస్తే పోలీసులు వారెంట్ లేకుండానే అరెస్టు చేస్తారు. సమ్మె చేసేవారిపై కేసులు పెడతారు. జైలు శిక్ష, లేదా జరిమానా పడుతుంది.

ఏపీ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు డిసెంబర్‌ 11న నుంచి సమ్మె ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతంగా సాగుతోంది. ప్రభుత్వం రెండు సార్లు జరిపిన చర్చలు బెడిసికొట్టాయి. ముందు సమ్మె విరమించాలని, తర్వాత సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతుతోంది. అయితే గట్టి హామీ ఇవ్వాలని, వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 

Tags:    

Similar News