24 గంటల్లోనే షర్మిలకు భద్రత పెంచుతూ నిర్ణయం

Update: 2024-02-08 12:10 GMT

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రభుత్వం భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ఆమెకు వన్ ప్లస్ వన్ భద్రతను ఉండగా సర్కార్ ఆమెకు 2 ప్లస్ 2 భద్రతను పెంచినట్లు తెలిపింది. ఈ మేరకు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అధికారికంగా ప్రకటనను విడుదల చేశారు. షర్మిల అభ్యర్థన మేరకు ఆమెకు భద్రతను పెంచినట్లుగా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు.

గత రెండు రోజుల నుంచి తనకు భద్రత కల్పించడం లేదంటూ వైఎస్ షర్మిల వైసీపీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు ఏదోక కీడు చేసేందుకే ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు సెక్యూరిటీని పెంచాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకోకపోవడం లేదని, తనకు చెడు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందని షర్మిల ఆరోపణలు చేశారు.

ప్రజలకు, ప్రతిపక్షాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం రక్షణ కల్పించకుండా చూస్తోందని, ప్రజాస్వామ్య పరంగా జగన్ సర్కార్ వ్యవహరించడం లేదంటూ షర్మిల మండిపడ్డారు. తనకు 4 ప్లస్ 4 భద్రత కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. అయితే షర్మిల కోరిన 24 గంటల్లోనే ఏపీ సర్కార్ ఆమెకు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. షర్మిలకు 2 ప్లస్ 2 భద్రతను పెంచినట్లు ప్రకటించింది.


Tags:    

Similar News