'విలేకరులు వ్యభిచార గృహాల్లోని బ్రోకర్ల కంటే హీనం'.. ప్రభుత్వ చీఫ్ విప్

Update: 2023-06-27 03:36 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. జర్నలిస్టులపై రెచ్చిపోయారు. చెప్పలేని, రాయలేని రీతిలో వారిపై తిట్ల దండకం అందుకున్నారు. కొన్ని చానళ్లలో పనిచేసే విలేకరులు వ్యభిచార గృహాల్లోని బ్రోకర్ల కంటే హీనమని అన్నారు. వారు ఆ ఛానెళ్ల నుంచి బయటకు వచ్చి కొబ్బరి బోండాలు అమ్ముకుంటే కాస్తంత మర్యాదగానైనా ఉంటుందని సలహా ఇచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తనకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే కొందరు ఇష్టమొచ్చినట్లు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు.




 


సోమవారం రాయదుర్గం పట్టణంలోని ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో విలేకర్లతో మాట్లాడుతూ.. ఆదివారం బొమ్మనహాళ్‌ మండలం గౌనూరు గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణపై ఆయా మీడియా ఛానళ్లు, పత్రికలు వ్యవహరించిన తీరు సరికాదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వంద కుటుంబాలున్న గ్రామంలో 11 ఇళ్లకు మాత్రమే తలుపులు వేశారని, గ్రామస్థులు పత్తి పొలాల్లో పనులు చేసేందుకు వెళ్లారన్నారు. వారు వచ్చిన తర్వాత కలిసి ఫొటోలు తీయించుకున్నామని, ఓర్వలేక ఇష్టమొచ్చినట్లు వార్తలు రాశారని మీడియా ప్రతినిధులపై ఊగిపోయారు. 




Tags:    

Similar News