CM Camp Office: విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్, వసతి సదుపాయలపై కమిటీ ఏర్పాటు

By :  Kiran
Update: 2023-10-11 17:01 GMT

దసరా అనంతరం పాలనను విశాఖకు తరలిస్తామన్న సీఎం జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్, వసతి సదుపాయంతో పాటు మంత్రులు, సీనియర్ అధికారులకు ట్రాన్సిట్ అకామిడేషన్ కోసం కమిటీని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కమిటీలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీ లక్ష్మి, ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌ రావత్ , సాధారణ పరిపాలన శాఖ మానవ వనరుల విభాగం కార్యదర్శులకు చోటు కల్పించారు. ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును సీఎం సమీక్షించాల్సి ఉందని, దీని కోసం ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి సమీక్షల కోసం సీఎం జగన్ విశాఖలో బస చేయాల్సి ఉన్నందున క్యాంప్ ఆఫీస్ బస ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా తరచూ ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, విభాగాధిపతులు ఆయా జిల్లాల్లో సమీక్షలు నిర్వహించాలంటూ ప్రభుత్వం బుధవారమే మరో ఉత్తర్వు జారీ చేసింది. క్షేత్రస్థాయి పర్యటనలు చేయడంతో పాటు స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు సీఎం సమీక్ష కోసం విశాఖ వచ్చే ప్రభుత్వ విభాగాలకు చెందిన కార్యదర్శులు, హెచ్ఓడీలు విశాఖ లేదా పరిసర ప్రాంతాల్లో ట్రాన్సిట్ వసతి కోసం సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Tags:    

Similar News