జగన్‌కు రుణపడి ఉండాలంటూ.. రసీదులపై AP ప్రజల సంతకాలు!!
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం.. ఆ రాష్ట్ర ప్రజలను లెక్కలడుగుతోంది. సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని ఒక్కో కుటుంబం.. ఎంత లబ్ధి పొందిందనే విషయాలను తమకు తెలియజేయాలని, లబ్ధి పొందినందుకు సీఎంకు జగన్ కు రుణపడి ఉన్నామంటూ లిఖిత పూర్వకంగా సంతకం చేయాలని రసీదుల ద్వారా అడుగుతోంది. గత నాలుగేళ్లలో రాష్ట్రంలోని ఒక్కొక్క కుటుంబానికి పథకాల రూపంలో ఎంత మొత్తం అందజేసింది ఓ రసీదులో నిర్ధారించి.. లబ్ధిదారులైన ఏపీ ప్రజల సంతకాలు సేకరించేందుకు సిద్ధమైంది జగన్ సర్కార్. ఇందుకు సంబంధించిన పుస్తకాలను వాలంటీర్లకు సరఫరా చేస్తోంది. శనివారం బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని మల్లాయపాలెం గ్రామ వాలంటీర్లకు ఈ రసీదు పుస్తకాలను పంపిణీ చేశారు. దీని ప్రకారం.. వాలంటీర్ ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి ప్రభుత్వం నుంచి వాళ్లు ఇంతవరకు ఎంత సాయం పొందారో వివరించి.. రసీదులపై సంతకాలు సేకరించాలి. ఆ వివరాలన్నీ తమకు అందజేయాలని అధికారులు హుకుం జారీ చేశారు.
అయితే 4 నెలల క్రితం(మే 23, 2023) న అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ళు పూర్తయిన సందర్భంగా.. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ద్వారా ఏపీ ప్రజలకు దాదాపు రూ.3.01 లక్షల కోట్ల మేర ప్రజలకు లబ్ధి చేకూర్చామని వైసీపీ ట్వీట్ చేసింది. రాష్ట్రంలోని ప్రతి వర్గానికి, ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలపింది. దేవుడి దయతో, ప్రజల ఆశీస్సులతో కేవలం 4 ఏళ్ల కాలంలోనే వైసీపీ ఎన్నికల మేనిఫేస్టో లో ఇచ్చిన హామీలలో 98.4% హామీలు సీఎం జగన్ నెరవేర్చారు అని పార్టీ నేతలు చెప్పారు. 47 నెలల్లో డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.10 లక్షల కోట్లు జమ చేశామన్నారు. నామినేటెడ్ నుంచి కేబినెట్ వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేశామన్నారు. పంచాయతీ, మండల పరిషత్, జెడ్పీ, పురపాలక, ఉపఎన్నికల్లోనూ రికార్డు విజయాలు సాధించామన్నారు.