ఏపీ విద్యార్థులకు శుభవార్త. నేడు (జూన్ 28) విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులను రిలీజ్ చేయనుంది జగన్ సర్కార్. పిల్లలను చదివించే తల్లులకు ఆర్థికంగా ప్రోత్సాహంగా.. వరుసగా నాలుగో ఏడాది కూడా అమ్మ ఒడి పథకం నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. అయితే గత మూడేళ్ల వరకూ రూ.15 వేలు ఇచ్చిన ప్రభుత్వం.. ఈ సారి రూ.13వేలు మాత్రమే ఇస్తోంది. నాడు-నేడు కింద కల్పిస్తున్న సౌకర్యాలు కొనసాగించేందుకు స్కూల్ మెయింటననెన్స్ ఫండ్ కింద రూ.1000, టాయిలెట్ మెయింటనెన్స్ కింద మరో రూ.1000 కట్ చేస్తున్నట్లు పేర్కొంది.
సీఎం జగన్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు. ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నారు. బుధవారం (28.06.2023) పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం లో బటన్ నొక్కి సీఎం జగన్ నిదులు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్ కాలేజ్ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం కురుపాంలోని బహిరంగ సభ వేదిక వద్దకు రోడ్డు మార్గంలో వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమ్మఒడి పథకం నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్.