Chandra Babu Naidu :చంద్రబాబుకు హైకోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు

Byline :  Veerendra Prasad
Update: 2023-10-13 05:48 GMT

టీడీపీ అధినేత  (Chandra Babu Naidu)చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ మేరకు తీర్పు రిజర్వ్‌ చేసిన కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ.. రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.




 


ఈ ఏడాది ఆగస్టు 4న ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరిట చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. అంగళ్లు మీదుగా ఆయన వెళుతున్నప్పుడు వైసీపీ శ్రేణులు, టీడీపీ కార్యకర్తల మధ్య పరస్పర వాగ్వాదం జరిగి.... ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన మొత్తం 179 మంది నేతలపై కురబలకోట మండలం ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో చంద్రబాబును ఏ-1గా చేర్చారు. హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై తెలుగు దేశం పార్టీ నేతలు హైకోర్టులను ఆశ్రయించగా.. విచారణ జరిపి బెయిల్ మంజూరు చేశారు.




 


ఇదిలా ఉండగా... ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసుపై చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. ఈ కేసు కొట్టివెయ్యాలనీ, తనను విడుదల చెయ్యాలని కోరుతూ చంద్రబాబు ఈ పిటిషన్‌ వేశారు. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. చంద్రబాబు తరపున సీనియర్ లాయర్ హరీష్ సాల్వే, CID తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. 




Tags:    

Similar News