Chandrababu Arrest : చంద్రబాబు క్వాష్ పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ

Byline :  Kiran
Update: 2023-09-19 03:05 GMT

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది. జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. చట్టవిరుద్ధంగా చంద్రబాబును అరెస్ట్‌ చేశారంటూ ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అనినీతి నిరోధ చట్టం సెక్షన్ 17A నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ పాటించలేదని అన్నారు. ప్రతిపక్ష నేతపై ఎఫ్​ఐర్​ నమోదు చేయాలన్నా, దర్యాప్తు కొనసాగించాలన్నా కచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలన్నారు. చట్టానికి విరుద్దంగా అరెస్ట్ చేశారని అంతటితో ఆగకుండా జ్యుడీషియల్ రిమాండ్​కు తరలించారని అన్నారు.జ్యుడీషియల్ రిమాండ్​ను సస్పెండ్ చేయాలని హైకోర్టును కోరారు. ఈ కేసులో పిటిషనర్‌కు ఐపీసీ 409 సెక్షన్ వర్తించదన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ నెల 18లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారంతో ఆ గడువు పూర్తి కావడంతో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరపనుంది.

మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, తాత్కాలిక బెయిల్‌ పిటిషన్‌పైనా ఇవాళ విచారణ జరగనుంది. ఈ కేసులో ఏ ఆధారాలతో చంద్రబాబును నిందితుడిగా చేర్చారో చెప్పేందుకు సీఐడీ వద్ద ప్రాథమిక వివరాలు లేవని పిటిషనర్ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. రాజకీయ ప్రతీకారంతో దురుద్దేశపూర్వకంగా చంద్రబాబును ఈ కేసులో ఇరికించారని అన్నారు. కేసు నమోదు చేసినప్పుడు పిటిషనర్ పేరు లేదని హఠాత్తుగా ఎఫ్ఐఆర్‌లో చేర్చారని.. అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇదిలా ఉంటే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌ సైతం ఈ రోజు విచారణకు వచ్చే అవకాశముంది.




Tags:    

Similar News