Chandrababu Naidu : చంద్రబాబు బెయిల్ షరతులపై ఏపీ హైకోర్టు తీర్పు ఇదే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ షరతులపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్ స్కాం కేసులో నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు నాయుడుకు హైకోర్టు పలు కండీషన్లు విధించింది. ఇకపై చంద్రబాబు నాయుడు పొలిటికల్ ర్యాలీల్లో పాల్గొనవద్దని ఆదేశించింది. అలాగే చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసుకు సంబంధించి ఎవరితోనూ చర్చించ వద్దు అని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఇద్దరు సీఐడీ డీఎస్పీల పర్యవేక్షణ ఉంచాలంటూ సీఐడీ అభ్యర్థనను తిరస్కరించింది. చంద్రబాబు నాయుడుకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో ఇద్దరు డీఎస్పీల పర్యవేక్షణ అవసరం లేదని స్పష్టం చేసింది.
చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ కండీషన్స్‌పై సీఐడీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ కేసుపై ఇరువురు వాదనలు విన్న హైకోర్టు వాదనలు ముగిసినట్లు ప్రకటించింది. అయితే తదుపరి తీర్పును ఈనెల 3న వెల్లడిస్తామని తెలిపింది. దీంతో శుక్రవారం ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు ఐదు షరతులు ఏదైతే విధించిందో వాటినే అమలు చేయాలని సూచించింది. అయితే చంద్రబాబు నాయుడు పొలిటికల్ ర్యాలీలో పాల్గొనవద్దని... స్కిల్ స్కాం కేసు గురించి ఇతరులతో చర్చించవద్దు అని ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇదే సందర్భంలో సీఐడీ డీఎస్పీల పర్యవేక్షణ అవసరం లేదని తెలిపింది. ఇకపోతే చంద్రబాబు నాయుడుకు 4 వారాలపాటు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఐదు కండీషన్లను పెట్టింది. అలాగే లక్షరూపాయల పూచీకత్తు ఇద్దరు షూరిటీలతో మధ్యంతర బెయిల్ ఇచ్చింది.