ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటీ : AP HighCourt
జగన్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసులు అరెస్ట్ చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించింది. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఏడేళ్ల లోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో సెక్షన్ 41ఏ నోటీసు ఇవ్వాలని స్పష్టం చేసింది. నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉండగా అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారని అడిగింది. అరెస్టు చేస్తే బాధ్యులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని న్యాయస్థానం హెచ్చరించింది.
ఉన్నతాధికారులపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేట్టు లేదని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో వివరాల సమర్పణకు సమయం కావాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. దీంతో న్యాయస్థానం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ కంపెనీల్లో ఇటీవల మైనింగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే ఎమ్మెల్యే తమ విధులకు ఆటంకాలు కలిగించారని అధికారులు మార్టూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు.