DSC Notification 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్(AP DSC Notification 2024) విడుదల అయ్యింది. 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను బుధవారం మధ్యాహ్నాం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుందని , మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. మార్చి 31 న పరీక్ష ప్రాథమికి కీ విడుదల చేస్తామని, ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. డీఎస్సీ నిర్వహణకు గత వారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఓకే చెప్పారు. మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ-2024 నోటిషికేషన్ విడుదలకు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.ఈ మెగా డీఎస్సీలో.. మొత్తం పోస్టుల్లో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2,280 ఎస్‌జీటీ పోస్టులు, 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయి. ఈ డీఎస్సీ (AP DSC)లో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్లపాటు గౌరవ వేతనానికి పని చేయాల్సి ఉంటుంది. టెట్, డీఎస్సీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ టీసీఎస్ (TCS)తో ఒప్పందం కుదుర్చుకోనుంది.
ఎస్జీటీ పోస్టులకు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్లకు పేపర్-2 విడివిడిగా టెట్ నిర్వహిస్తారు. ఎస్జీటీ పోస్టులకు D.Ed లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే అర్హులు. టెట్ రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు 40 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది.