Common Capital : వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు : మంత్రి బొత్స

Byline :  Veerendra Prasad
Update: 2024-02-14 08:40 GMT

ఏపీకి ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌‌ను కొనసాగించాలని వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదన్న మంత్రి.. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ విశ్వనగరం అని అది ఏమైనా వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఆస్తియా? అని ప్రశ్నించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. అసలు హైదరాబాద్‌ నుంచి అర్ధరాత్రి చంద్రబాబు పారిపోయి వచ్చిన కారణంగా ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది అన్నారు.

10ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని సాధ్యం కాదన్నారు మంత్రి బొత్స. రాజధానిపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి లబ్ధి పొందాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వంపై ఏడవటం తప్ప ప్రతిపక్షాలకు వేరే పని లేదంటూ మండిపడ్డారు. తమ నాయకుడు సీఎం జగన్ ఒకటే చెప్తున్నాడని... మేము మంచి చేశాం అనుకుంటేనే మళ్లీ నాకు అవకాశం ఇవ్వండి అంటున్నారని వెల్లడించారు. అలా అనడంలో తప్పు ఏముందని అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన పాపాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. ప్రతిపక్షం చేసే చౌకబారు విమర్శలకు తాము స్పందించమన్నారు. తాము ప్రజలకు ఏం మేలు చేశామో అది చెప్పే ఓట్లు అడుగుతామని.. ఇలాంటి జిమ్మిక్కులు మాకు అవసరం లేదని తెలిపారు.




Tags:    

Similar News