YCP నాయకులు చెప్పిన పిల్లల్నే వాలంటీర్లుగా నియమించాం.. ఏపీ మంత్రి

Byline :  Veerendra Prasad
Update: 2023-08-29 04:18 GMT

'రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో వైసీపీ నాయకులు చెప్పిన పిల్లల్నే వాలంటీర్లుగా నియమించాం. వారి ద్వారానే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి' అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసుతోపాటు జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిన్న శ్రీకాకుళంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. పార్టీ నాయకత్వంపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని.. సొంతపార్టీ వారిపైనే విమర్శలు చేశారు.

‘రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టారన్నారు. పాలనలో సమూల మార్పులు తీసుకురావడంతో.. కార్యకర్తల చేతిలో ఉన్న అధికారాలు(చక్రం) తీసేశారనే ఆవేదన, బాధ మీ అందరిలో ఉందంటూ పార్టీ కార్యకర్తలనుద్దేశించి బుజ్జగించినట్లుగా మాట్లాడారు. అది వాస్తవమే అని.. అయితే కార్యకర్తల బాధ వల్ల ప్రజల్లో పార్టీపై తప్పుడు భావం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు.

కార్యకర్తలంతా పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలని... వైసీపీ నాయకులు చెప్పిన పిల్లల్నే వాలంటీర్లుగా నియమించామన్నారు. 'పేదలకు మేలు చేయడంలో మీ సహకారం ఉందని, పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని సంతోషించండి. నాకేమీ సంబంధం లేదనే భావనతో కార్యకర్తలు, నాయకులు ఉండొద్దు. పార్టీలో అందరికీ సరైన సమయంలో గుర్తింపు లభిస్తుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి’ అని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.

Tags:    

Similar News