స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేతకు హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. తనపై మోపిన కేస్‌లను కొట్టేయాలని చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ విషయంపై ఏపీ మంత్రి రోజా శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద స్పందించారు. హైకోర్టు తీర్పుపై టీడీపీ నేతలు ఇప్పుడు ఏం చెబుతారంటూ ఆమె ప్రశ్నించారు. బాలకృష్ణ ఇప్పుడు హైకోర్టుకు వెళ్లి తొడకొట్టు అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కళ్లు తెరవాలని ఆమె సలహా ఇచ్చారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ.."స్కిల్ కేసులో హైకోర్టు తీర్పుతోనైనా టీడీపీ నేతలు కళ్లు తెరుచుకోవాలి. అసెంబ్లీలో ఈ స్కామ్ పై చర్చించకుండా టీడీపీ ఎమ్మెల్యేలు తప్పించుకున్నారు. నిన్నటి వరకు స్కిల్ స్కాంపై ప్రభుత్వం దగ్గర ఆధారాలే లేవన్నారు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏం చెబుతారు. బాలకృష్ణ ఎందుకు ఈ రోజు అసెంబ్లీ నుంచి పారిపోయారు. ఇప్పుడు మీ బావ కోసం హైకోర్టుకు వెళ్లి తొడకొట్టి మీసాలు మెలేయండి. ప్రజల ధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు. ఈ కేసులో కోర్ట్‌లు రిమాండ్‌కు పంపిస్తే... జగన్ ఎందుకు క్షమాపణ చెప్పాలి"అని మంత్రి రోజా నిలదీశారు.