Ap budget-2024 : ఏపీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన బుగ్గన

Update: 2024-02-07 06:25 GMT

(Ap budget-2024) ఆంధ్రప్రదేశ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ 2024-25ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం ప్రవేశపెట్టారు. రూ.2,86,389 కోట్లతో బడ్జెట్‌ను ఆయన ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా రెవిన్యూ వ్యయం రూ. 2,30,110 కోట్లుగా, పెట్టుబడి వ్యయం రూ.30,530 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మొదట మహాత్మగాంధీ సందేశంతో మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కడం ఆనందంగా ఉందన్నారు. మేనిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంథంగా భావిస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్‌ను ముఖ్యంగా ఏడు అంశాల మీద రూపొందించినట్లు వెల్లడించారు.

ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ మూల ధన వ్యయం రూ.30,558.18 కోట్లు, రెవిన్యూలోటు రూ.24,758.22 కోట్లు, ద్రవ్యలోటు రూ.55,817.50 కోట్లు, జీఎస్‌డీపీ ద్రవ్యలోటు 3.51 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు. బడ్జెట్‌లో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పెద్దపీట వేసినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం గడప గడపకూ పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 55 రెవిన్యూ డివిజన్లను కాస్తా 78కి పెంచామన్నారు. 2.6 లక్షల మంది వాలంటీర్లను నియమించినట్లు తెలిపారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.

వైసీపీ ప్రభుత్వ పాలనలో 4వ తరగతి నుంచి ఆపై తరగతుల వరకూ 34.30 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందారన్నారు. ఏటా 47 లక్షల మంది పిల్లలకు స్కూల్ కిట్లు ఇస్తున్నామన్నారు. మొత్తం 99.81 శాతం స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. 43 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 1000 స్కూళ్లలో సీబీఎస్ఈ తరహా విద్యా విధానాన్నిఅందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మధ్యాహ్న భోజనం కింద గత ప్రభుత్వం కంటే 4 రెట్లు ఎక్కువగా ఖర్చు చేశామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.   


Tags:    

Similar News