బీసీలు తేరగా దొరికారా? టోపీ పెట్టడానికి టీడీపీ, వైసీపీ, బీజేపీ రెడీ..

Byline :  Lenin
Update: 2024-01-01 09:40 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు మళ్లీ బీసీ మంత్రజపం మొదలెట్టాయి. ఎన్నికలు దగ్గర పడడంతో అన్ని పార్టీలూ జనాభాలో అత్యధికంగా ఉన్న వెనుకబడిన వర్గాన్ని ఆకట్టుకోవడానికి నానా తిప్పలూ పడుతున్నాయి. టీడీపీ, వైపీసీనే కాదు, బీజేపీ కూడా తానేం తక్కువ కాదంటూ ఆకర్ష మిషన్‌కు తెరలేపింది. పార్టీలు ‘బీసీ గర్జన’, ‘బీసీ ఆత్మగౌరవం’, ‘బీసీ సామాజిక చైతన్య సభ’ వంటి నానా పేర్లతో మళ్లీ రాజకీయ భిక్షాటనకు సిద్ధమయ్యాయి. ఇంత హడావుడి చేసినా చివరికి టికెట్ల విషయంలో బీసీలకు మొండి చేయే విదిలిస్తాయని బీసీ నేతలు కూడా లైట్‌గా తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ధనబలం, కండబలం ఉన్నవారికే దక్కుతాయని, వెనుకబడిన వారికి దక్కవని గత ఎన్నికలు నిరూపించడంతో తాజా బీసీ జపం రొటీన్ వ్యవహారంగా మారిపోనుంది.

గతంలో బీసీలకు కాస్త ప్రధాన్యమిచ్చిన టీడీపీ ఆ వర్గాన్ని మళ్లీ ఆకట్టుకోవడానికి ఈ నెల 4 నుంచి ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో పాగా వేయాలని బీజేపీ కూడా ఈ నెల 7న విశాఖపట్నంలో ‘బీసీ సామాజిక చైతన్య సభ’ నిర్వహించనుంది. టీడీపీ బీసీ భజనకు దీటుగా తాము కూడా భజన చేయడానికి వైపీపీ సైతం సభలకు సిద్ధమవుతోంది. పులివెందుల టికెట్‌‌ను జగన్ బీసీలకు ఇచ్చి వారిపై ప్రేమ చాటుకోవాలని చంద్రబాబు నాయుడు చేసిన సవాల్ వైసీపీని ఇబ్బంది పెడుతోంది. ఆయా పార్టీల్లోని బీసీ నేతలు ఈ హడావుడి చూసి నవ్వుకుంటూనే టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల డేటాను పరిశీలిస్తే బీసీలకు టికెట్లు ఇవ్వడంలో టీడీపీ.. వైసీపీకంటే కాస్త బెటరేనని తెలుస్తుంది.

ఏపీ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు పాలనలో ఇప్పటికీ సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల్లో అత్యధికం అగ్రవర్ణాలవారే ఉన్నారు. రెడ్డి, కమ్మ ఇతర అగ్రవర్ణాలు సింహభాగం దక్కించుకున్నాయి. గత ఎన్నికల్లో కడప జిల్లాలోని 10 స్థానాల్లో ఏడింటిలో జగన్ తన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులనే నిలబెట్టారు. 14 స్థానాలున్న చిత్తూరులోనూ ఏడు స్థానాల్లో రెడ్లే బరిలోకి దిగారు. రిజర్వేషన్లు, ఇతర అనివార్య పరిస్థితులు ఉంటేనే ఇతరులకు టికెట్లు కేటాయించారు. టీడీపీ ఎక్కువ సీట్లను కమ్మ నేతలకు కేటాయించింది. రెడ్ల ప్రాబల్యమున్న రాయలసీమలో పచ్చపార్టీ తరఫున కూడా రెడ్లే అత్యధిక సంఖ్యలో బరిలోకి దిగారు.

ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లున్నాయి. బీసీలకు న్యాయం చేస్తామంటున్న పార్టీలు మాట నిలబెట్టుకోవాలంటే 90కిపైగా సీట్లను వారికి కేటాయించాలి. అయితే ఇందుకే ఏ పార్టీకూడా సిద్ధపడదు అన్నది నగ్న సత్యం. ఎన్నికల్లో గెలుపే లక్ష్యమైన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు పాటిస్తుంటాయి. అభ్యర్థి ఆర్థికంగా బలంగా ఉండాలి. బందీ మార్బలం తప్పనిసరి. పార్టీకి ఫండింగ్ దగ్గర్నుంచి ఓటర్లకు డబ్బు పంచేవరకు అన్ని వ్యవహారాలను డబ్బు బలంతో పకడ్బందీగా నడిపించేవారే టికెట్లకు అర్హులు. అలాంటి వారిలో బీసీలు చాలా తక్కువ మంది కనుక వారికి దక్కే టికెట్లు కూడా తక్కువే. వచ్చే ఎన్నికల్లో జరగబోయేది కూడా అదే. ఎంతయినా ఎన్నికల వేళ కాబట్టి ఆకర్ష ఆకర్ష వ్యూహంలో భాగంగా బీసీ సభలకు పార్టీలకు అంకింతభావంతో, చిత్తశుద్ధితో సన్నద్ధమవుతున్నాయి.

Tags:    

Similar News