ఏపీ మంత్రి ఛాంబర్కు తాళం వేసిన సిబ్బంది..ఎందుకంటే..?

Update: 2023-06-12 12:56 GMT

ఏపీ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణకు తన పేషీ సిబ్బంది ఝలక్ ఇచ్చారు. ఏకంగా ఆయన ఛాంబర్కే తాళం వేశారు. 8నెలలుగా జీతాలు ఇవ్వడంలేదంటూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఈ పనిచేశారు. తమ జీతాలు ఇచ్చేదాక తాళం తీసే ప్రసక్తే లేదని వారు తేల్చిచెప్పారు. మంత్రి సహా ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.

డిసెంబర్ నుంచి జీతాలు చెల్లించకపోవడంతో తాము ఎలా బతకాలని సిబ్బంది వాపోయారు. జీతాలు లేకపోవడంతో ఇప్పటికే వారంతా ఉద్యోగాలకు వెళ్లడం లేదు. ఈ క్రమంలో సచివాలయానికి వెళ్లిన సిబ్బంది మంత్రి ఛాంబర్కు తాళం వేసి వెళ్లిపోయారు. అసలు తాళం ఎక్కడుందో కూడా అధికారులకు తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో మంత్రి క్యాంపు కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

మరో దారి లేకపోవడంతోనే మంత్రి పేషీకి తాళం వేశామని ఔట్ సోర్సింగ్ సిబ్బంది చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ జీతాలను చెల్లించాలని కోరారు. కాగా సచివాలయంలో మంత్రి ఛాంబర్కే తాళం వేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


Tags:    

Similar News