ఈరోజు స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఎందుకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు, కాలేజీలకు విద్యార్థి సంఘాలు బంద్ ప్రకటించాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు మద్దతు ప్రకటించిన ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు.. ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేస్తారన్న ఊహాగానాలతో గత కొన్ని నెలలుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం నిరసనలు ప్రారంభించి బుధవారానికి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈ బంద్ చేపడుతున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ బంద్‌ను పాటిస్తున్నాయి.
లాభాలు వస్తున్నప్పటికీ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు విరమించుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇనుము, గనులు కేటాయించకపోవడం దారుణమని పేర్కొన్నారు. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించాలని చూడటం పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారని.. పదేళ్లు పూర్తవుతున్నా.. ఇంత వరకు దాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయలేదని తెలిపారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే లక్షలాది మంది రాయలసీమ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు.