బరితెగించిన వలంటీర్లు.. అత్యాచార యత్నాలు.. ముసలోళ్ల డబ్బుతో పరారీ..

Update: 2023-08-05 03:59 GMT

ఏపీలోని గ్రామ వలంటీర్ వ్యవస్థపై విమర్శలు వస్తున్నా కొందరికి ఏమాత్రం చీమకుట్టినట్టయినా లేదు. తన దుర్మార్గాల వల్ల మొత్తం వలంటీర్లకే చెడ్డపేరు వస్తుందని తెలిసినా ఘోరాలకు పాల్పడుతూనే ఉన్నారు. మొన్న విశాఖపట్నంలో నగల కోసం ఒక వలంటీర్ వృద్ధురాలిని హతమార్చగా, నిన్న కర్నూలులో ఒక వలంటర్ అమ్మాయి చేయిపట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. తాజాగా ఒకే రోజు ఏపీలో పలు జిల్లాల్లో కొందరు వలంటీర్లు అత్యాచార యత్నాలకు, ఇతర నేరాలకు పాల్పడ్డారు.

ప్రకాశం జిల్లాలో మరో వలంటీర్.. తన బంధువు కూతురిపైనే అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఆమె ఒక్కతే ఉండడం గమనించి కీచకకాండకు తెరతీశాడు. ఆమె భయంతో కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి దేహశుద్ధి చేశారు. దర్శి మండలంలోని ఎర్రబోయినపల్లి అగ్నిపురి కాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వలంటర్ గుంటూరి అశోక్‌ తన బంధువు ఇంట్లోకి వెళ్లి అక్కడ ఒంటరిగా ఉన్న బాలికను బలవంతం చేయబోయాడు. బాలిక భయంతో అరుస్తూ ఇంట్లోంచి బయటికొచ్చి దగ్గర్లో ఉన్న తల్లికి చెప్పింది. తర్వాత బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం కంచల గ్రామంలో వలంటీర్‌గా పనిచేస్తున్న చలమల శ్రీనివాసరావు కూడా అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఓ యువతి ఇంట్లోకి వెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో పక్కింటివారు వచ్చి అడ్డుకున్నారు. తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఓ వలంటీర్ అక్రమ మద్యం అమ్ముతూ దొరికాడు. బొమ్మలాటపల్లి గ్రామ వలంటీర్‌ దేవమణి దొంగచాటుగా మద్యం అమ్ముతున్నట్టు తెలియడంతో పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. 22 మద్యం సీసాలు దొరకడంతో నిందితులను అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాలో ఓ వలంటీరు ముసలోళ్ల డబ్బు కాజేశాడు. మర్రిపాడు మండలం బాట గ్రామ వలంటీరు నల్లిపోగు ఖాదర్‌బాబు వద్ధులకు ఇవ్వాల్సిన రూ.50 వేలు పంచకుండా ఇంట్లో పెట్టుకున్నాడు. వృద్ధుల ఫిర్యాదుతో పోలీసులు అతని ఇంట్లో సోదా చేసి సొమ్ము స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News