YS Sharmila: ఆర్టీసీ బస్సులో సామాన్యులతో కలసి AP PCC చీఫ్ ప్రయాణం
ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APPCC Chief YS Sharmila) ముందుకు సాగుతున్నారు. నేటి నుంచి జిల్లాల పర్యటనకు షర్మిల శ్రీకారం చుట్టారు. ఈరోజు నుంచి తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలోని జిల్లాల్లో పీసీసీ చీఫ్ పర్యటించనున్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటన సాగనుంది. తొలిరోజు మంగళవారం ఇచ్చాపురంలో పర్యటన నేపథ్యంలో వైఎస్ షర్మిల ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర కాంగ్రెస్ నేతలు మాణిక్కం ఠాకూర్, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డితో కలిసి వైఎస్ షర్మిల ఆర్టీసీ బస్సు ఎక్కారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఆమె బస్సులో ప్రయాణం చేశారు. బస్సులో ప్రయాణికులతో షర్మిలతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ముఖాముఖీ మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు ఇతర వివరాలను ప్రయాణికులను షర్మిల ఆరా తీశారు. అలాగే వ్యక్తిగత అంశాల్ని కూడా మహిళా ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.
వైఎస్ షర్మిల సడన్ గా బస్సు ఎక్కడం, తమతో మాట్లాడుతుండటంతో ప్రయాణికులు కాసేపు కంగారుపడ్డారు. ఏం జరుగుతుందో అర్ధం కాక తొలుత ముభావంగా స్పందించిన వారు.. ఆ తర్వాత సరదాగా మాట్లాడారు. షర్మిల అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. టీవీల్లో కనిపించే రాజకీయ నాయకురాలు నేరుగా తమ వద్దకు రావడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. . మరోవైపు బస్సు ప్రయాణంలో వైఎస్ షర్మిల చివరిగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి తనను పక్కరాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తిగా అభివర్ణించడంపై స్పందించారు. సుబ్బారెడ్డికి తాను జగన్ రెడ్డి అనడం నచ్చలేదని, మీకు నచ్చకపోతే ఇకపై జగనన్న గారూ అనే పిలుస్తానని షర్మిల తెలిపారు. తాము చేసిన అభివృద్ధి కనిపించడం లేదన్న సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మీ అభివృద్ధి చూపించడానికి సిద్ధమైతే తాను వస్తానని, మీడియా కూడా వస్తుందని డేట్, టైమ్ చెప్పాలని షర్మిల సవాల్ విసిరారు.