31st December : బీరు పార్టీ చేసుకున్న ఆరవ తరగతి విద్యార్థులు

Byline :  Veerendra Prasad
Update: 2024-01-03 05:03 GMT

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే.. బీరు, బిర్యానీ ఉండాల్సిందే అని అనుకున్నారేమో ఆ విద్యార్థులు. ఏకంగా స్కూల్‌కి దగ్గరలోనే ఓ స్థలాన్ని ఎంచుకుని అక్కడే మిడ్ నైట్.. డ్రింక్ పార్టీని జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటికి రావడంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలోని అనకాపల్లి జిల్లా చోడవరంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్థానిక కో-ఆపరేటివ్‌ కాలనీలోని బీసీ బాలుర వసతి గృహంలో ఉంటున్న 6, 7, 10 తరగతులకు చెందిన 16 మంది విద్యార్థులు 31వ తేదీ రాత్రి పక్కన నిర్మాణంలో ఉన్న భవనంలో మందు పార్టీ చేసుకున్నారు. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో వీరికి స్థానికంగా ఉన్న మరో ఇద్దరు యువకులు జత కలిశారు.

అందరూ కలసి హాస్టల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంటుకు చేరుకొని బిర్యానీ, మందు పార్టీ చేసుకున్నారు. రాత్రంతా మత్తులో ఊగారు. వారంతా అల్లరి చేస్తుండటం గమనించిన ఏసీ మెకానిక్‌, డ్రైవింగ్‌ స్కూల్‌ డ్రైవర్‌ ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు విద్యార్థులు వారిని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ఏసీ మెకానిక్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అయితే 31వ తేదీ రాత్రి పది గంటల వరకూ తాను హాస్టల్‌లోనే ఉన్నానని హాస్టల్ వార్డెన్‌ చిన్నయ్య అంటున్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లానని చెబుతున్నారు. తాను హాస్టల్‌ నుంచి వెళ్లిన తరువాత విద్యార్థులు ఏం చేశారో తెలియదన్నారు. హాస్టల్ నుంచి వెళ్లిన విద్యార్థులు ఇలా మందు పార్టీ చేసుకోవడం చర్చనీయాంశమైంది.




Tags:    

Similar News