ఏపీలో నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు.. పలు ఆస్పత్రుల లైసెన్స్‌లు రద్దు

Update: 2024-01-26 11:09 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం నుంచి రూ.1200 కోట్ల బకాయిలు అందాల్సి ఉంది. అయితే ఆ నిధులు అందకపోవడంతో ఆయా ఆస్పత్రుల యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే బకాయిలు విడుదల చేయాలని ఆస్పత్రి యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే ప్రభుత్వం నుంచి వారికి సరైన సమాధానం రాలేదు. దీంతో మరోమారు ఆస్పత్రి యాజమాన్య సంఘాలు విడుదల చేయాలని, పలు రకాల శస్త్ర చికిత్సల ఛార్జీలను పెంచాలని ప్రభుత్వానికి విన్నవించాయి.

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా సరైన స్పందన రాలేదు. ఈ విషయంలో గత 20 రోజులుగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. అయినప్పటికీ సర్కార్ నుంచి సానుకూలమైన స్పందన రాలేేదు. దీంతో ఆరోగ్యశ్రీ సేవలను నిన్నటి నుంచి ఆయా ఆస్పత్రులు నిలిపివేశాయి. జగన్ సొంత జిల్లా కడపలో కూడా పలు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి. ఆ ఆస్పత్రి యాజమాన్యాలకు ప్రభుత్వం షాకిచ్చింది.

కడపలోని 18 ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతుండగా అందులో 17 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశారు. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసినట్లుగా ఆ ఆస్పత్రుల ముందు బోర్డులు పెట్టారు. దీంతో ఆ 17 ఆస్పత్రుల లైసెన్సులను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు కూడా అందాయి. కడపలోనే కాకుండా రాజమండ్రిలో 14 ఆస్పత్రులు, విశాఖలో 4 ఆస్పత్రుల లైసెన్సులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.


Tags:    

Similar News