Ex MP Arunkumar : ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీదే గెలుపు ఉండవల్లి కామెంట్స్

Byline :  Vamshi
Update: 2024-02-18 10:08 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని ఆయన అన్నారు. బాబు హయాంలో పోలవరానికి జనాన్ని బస్సులో తీసుకెళ్ళి భజనలు పెట్టి చూపించారని ఉండవల్లి అన్నారు. పోలవరం ప్రాజేక్టును కేంద్రం ఇప్పటి వరుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను చూడకుండా ముఖ్యమంత్రి జగన్ పోలీసులను పెట్టాడు’’ అని అరుణ్ కుమార్ అన్నారు. ఏపీ విభజన జరిగి నేటికి (ఆదివారం) పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ వాళ్లు విడుదల చేసిన పుస్తకం ఆధారంగా కోర్టులో పిటిషన్ వేశానని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు 70 మంది మాత్రమే విభజన సమయంలో హాజరయ్యారని, ప్రాంతీయ పార్టీలన్ని వ్యతిరేకించాయని పేర్కొన్నారు.

జగన్ అఫిడవిట్ వేశారని, అయితే ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు ఎవరూ హాజరుకావటం లేదని ఉండవల్లి ప్రశ్నించారు. ‘‘ఏపీ విభజన తప్పా, కరెక్టా తీర్పు చెప్పాలని సుప్రీంకోర్టుని అడుగుతున్నాను. టెర్రరిస్టులు పార్లమెంట్‌పై దాడి చేసినప్పుడు కూడా ఇలా తలుపులు మూయలేదు. ఏపీ విభజన సమయంలోనే తలుపులు మూసేశారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 70 శాతం నిధులు ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వమే విభజన చట్టాన్ని అమలు చేయాలి. పదేళ్లు పూర్తయిన విభజన హామీ చట్టం అమలు చేయడం లేదు’’ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలు కోసం కేంద్రాన్ని అష్టదిగ్బందం చేసి నిలదీయాలని, విభజన హామీల కోసం సీఎం ఏం సాధించారో చెప్పాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు మోదీ ప్రభుత్వన్ని నిలదీయడంలో విఫలమయ్యాయని ఆయన అన్నారు.

Tags:    

Similar News