టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమమని, ఈ అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ పోరాటం ఇంతటితో ఆగేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రజలంతా టీడీపీ వెంటే ఉన్నారని బాలకృష్ణ తెలిపారు. ప్రజల్లో టీడీపీకి వస్తున్న ఆదరణను, స్పందనను చూసి ఓర్వలేకనే అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆయన ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమ అరెస్టులు, అక్రమ కేసులతో తాము భయపడేది లేదని బాలకృష్ణ తేల్చేశారు.
ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని గళమెత్తటమే లక్ష్యంగా సభకు వెళ్తున్నామని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంలో ఏపీ సర్కార్ భేషరతుగా సారీ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరిపిన తర్వాతే మరో అంశాన్ని తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సెక్రటేరియట్ సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర టీడీపీ నాయకులు ప్రొటెస్ట్ చేశారు. ఈ నిరసనలో వైకాపా బహిష్కృత ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ పలు ప్లకార్డును ప్రదర్శించారు. బాబుపై అక్రమ కేసులు ఎత్తేయాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత తుళ్లూరు నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యేలు పాదయాత్రగా వెళ్లారు.