వైఎస్ వివేకా కేసు.. ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు

Update: 2023-07-15 05:08 GMT

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దాఖలు చేసిన మూడో చార్జిషీట్‌ను హైదరాబాద్‌లోని సీబీఐ స్పెషల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా ఆగస్టు 14న కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ అవినాష్ రెడ్డికి న్యాయమూర్తి సమన్లు జారీచేశారు. సీబీఐ దాఖలు చేసిన అడిషనల్ ఛార్జిషీట్‌లో ఏ6గా ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, ఏ7గా భాస్కర్‌ రెడ్డి, ఏ8గా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని, అనుమానితులుగా ఎంవీ కృష్ణారెడ్డి, వంట మనిషి కుమారుడు ప్రకాశ్‌ పేర్లను సీబీఐ ప్రస్తావించింది. వివేకా హత్యకు కుట్ర చేయడం నుంచిఆధారాలను చెరిపేసే వరకు వారి పాత్ర ఉన్నట్లు చెప్పింది.

ఇదిలా ఉంటే శుక్రవారం జరిగిన కోర్టు విచారణకు చంచల్‌గూడ జైల్లో ఉన్న నిందితులు గంగిరెడ్డి, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని పోలీసులు హాజరు పరిచారు. కోర్టు వీరందరికీ ఆగస్టు 14 వరకు రిమాండ్‌ను పొడిగించింది. కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి విచారణకు డుమ్మాకొట్టాడు.

వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐ సిద్ధం కాగా ఆయన తెలంగాణ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఒకవేళ ఆయనను అరెస్ట్ చేయాల్సి వస్తే రూ. 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో వదిలేయాలని హైకోర్టు సీబీఐకి స్పష్టం చేసింది. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు సీబీఐ ఆయనను అరెస్ట్‌ చేసి పూచీకత్తుతో వదిలేసింది. బెయిల్‌పై ఉన్న బయట ఉన్న అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యేలా చూసే బాధ్యతను న్యాయమూర్తి సీబీఐకి అప్పగించారు.

Tags:    

Similar News