వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ మరోసారి విచారించింది. ఇవాళ ఉదయం ఆయన సీబీఐ విచారణకు హాజరుకాగా పలు అంశాలపై అధికారులు ప్రశ్నించారు. నాలుగు కోట్లు రూపాయల ఫండింగ్‌పై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. క్రైమ్ సీన్‌లో ఆధారాలు చేరపడం, నిందితులతో మాట్లాడడం, కేసు పెట్టవద్దని సీఐ శంకరయ్యకు చెప్పవడం వంటి అంశాలపై అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అప్రూవర్‌గా మారిన దస్తగిరిని వాస్తవాలు చెప్పొద్దని ఎందుకు ప్రలోభాలకు గురి చేశారని అధికారులు అడిగారని సమాచారం.
ఈ కేసులో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు.. ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆయన ఇవాళ సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి నిందితుడని భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ సందర్భంగా సీబీఐ కోర్టుకు తెలిపింది. వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్, భాస్కర్‌రెడ్డి ప్రమేయం ఉందని అభియోగాలు మోపింది.
వివేకా హత్య, ధ్వంసం వెనక భారీ కుట్రపై దర్యాప్తు సాగుతుందని సీబీఐ చెప్పింది. అవినాష్, భాస్కర్‌రెడ్డిలు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించింది. కాగా ఈనెల 3న వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి ఆ తరువాత కొద్దిసేపటికే రూ.5 లక్షల పూచీకత్తుతో విడుదల చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఆయన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై సుప్రీం మంగళవారం విచారణ జరపనుంది.