రిలేషన్ ఉన్నంత మాత్రాన రూల్స్ క్రాస్ చేస్తామా..? జైలు సూపరిండెంట్
స్కిల్ స్కాం ఆరోపణలతో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అప్పటివరకూ జైలు సూపరింటెండెంట్ గా రాహుల్.. వ్యక్తిగత కారణాల వల్ల సెలవులపై వెళ్లగా.. అతని స్థానంలో ఏపీ జైళ్ల శాఖ కోస్త్రాంధ్ర డీఐజీ ఎంఆర్ రవికిరణ్.. రాజమండ్రి సెంట్రల్ జైలు ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి రవికిరణ్ బంధువు కావడంతో.. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా నియమించారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రవికిరణ్ స్పందిస్తూ... అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులకు రాజకీయ నాయకులతో సంబంధం ఉంటుందని... అంతమాత్రాన అందరూ నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తారనడం సరికాదని చెప్పారు. చంద్రబాబును ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే తనను వ్యూహాత్మకంగా రాజమహేంద్రవరం జైలు ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా నియమించారనే ఆరోపణ అసత్యమన్నారు.
చంద్రబాబు భద్రతపై నారా లోకేశ్ అనుమానాలను వ్యక్తం చేయడం వల్లే తనకు సెంట్రల్ జైలు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా తాత్కాలిక బాధ్యతలను అప్పగించారని చెప్పారు. నిబంధనల మేరకు చంద్రబాబుతో ములాఖత్ కోసం ఆయన భార్య భువనేశ్వరి పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించామని తెలిపారు. చంద్రబాబుకు భద్రతా ఏర్పాట్లను పెంచాలని కోరుతూ లోకేశ్ లేఖ రాయడం వల్లే ఈ నెల 12న రాత్రిపూట జైల్లో రౌండ్ వేశానని చెప్పారు.