ఇంటి కన్నా జైలే పదిలం.. హౌస్ రిమాండ్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబు పిటిషన్ తిరస్కరించారు. పిటిషన్పై రెండ్రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు హౌస్ రిమాండ్ కోరుతూ ఆయన తరఫు లాయర్లు చూపిన కారణాలను సీఐడీ తరఫు అడ్వొకేట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. బాబు ఆరోగ్యం బాగానే ఉందని, జైలులో ఆయనకు పూర్తి స్థాయి భద్రత కల్పించామని అడిషనల్ ఏజీ కోర్టుకు తెలిపారు. జైలు లోపలే కాకుండా పరిసర ప్రాంతాల్లోనూ పోలీసు భద్రత ఉన్నట్లు ధర్మాసనానికి విన్నవించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారమని చెప్పారు. రాజమహేంద్ర కేంద్ర కారాగారంలో 50 అడుగుల ఎత్తైన గోడలు ఉన్నాయని అదనపు ఏజీ కోర్టుకు చెప్పారు. ఆర్థిక నేరాల్లో సాక్ష్యాలను ప్రభావం చేసే అవకాశం ఉండటం వల్ల.. చంద్రబాబును హౌస్ రిమాండ్‌కు అనుమతించవద్దని అడిషనల్ ఏజీ న్యాయస్థానాన్ని కోరారు.
ఇక చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఆయనకు జైలులో ప్రమాదం పొంచి ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ జైలులో కరుడుగట్టిన నేరస్థులుఉన్నారని, చంద్రబాబుకు ముప్పు ఉన్నందున ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పించారని లూథ్రా కోర్టుకు విన్నవించారు. కేంద్రం కల్పించిన సెక్యూరిటీ విషయంలో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకోలేదన్న విషయాన్ని కోర్టుకు విన్నవించారు. హౌస్ రిమాండ్‌కు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లూథ్రా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు చంద్రబాబు ఇంటిలో కన్నా జైలులోనే భద్రత ఎక్కువన్న న్యాయమూర్తి హౌస్ కస్టడీ పిటిషన్ తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడును సీఐడీ కస్టడీ పిటిషన్పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. కేసు దర్యాప్తులో భాగంగా చంద్రబాబును విచారించేందుకు 5 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై చంద్రబాబు తరఫు అడ్వొకేట్లు బుధవారం కౌంటర్ దాఖలు చేయనున్నారు.