జైలులో మానసిక క్షోభకు గురి చేస్తున్నారు.. తప్పు చేస్తే.. : చంద్రబాబు
తనను అక్రమంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడును పోలీసులు కోర్టు ఎదుట హాజరిపరిచారు. జైలు అందుతున్న వసతులు, కస్టడీ పిటిషన్ పై చంద్రబాబు అభిప్రాయాన్ని జడ్జి కోరారు. ఈ సందర్భంగా జైలులో ఉంచి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని బాబు అన్నారు. తప్పు చేసి ఉంటే విచారణ జరిపి అరెస్ట్ చేయాలని చెప్పారు.
తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అని.. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారని.. చేయని తప్పును చేశానని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు వాదనలపై జడ్జి స్పందించారు. ‘‘మీపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే.. నేర నిరూపణ కాలేదు. మీరు పోలీసు కస్టడీలో లేరు.. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మీరు దీన్ని శిక్షగా భావించవద్దు. చట్టం, నిబంధనల ప్రకారమే మీకు రిమాండ్ విధించాం. మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని జడ్జి చెప్పారు.