Chandrababu : ఆ విషయంలో తగ్గేదే లేదు..ఫస్ట్ లిస్ట్ అభ్యర్థులకు చంద్రబాబు హెచ్చరిక

Byline :  Vinitha
Update: 2024-02-26 02:30 GMT

ఏపీలో ఎన్నికల హాడావిడి నడుస్తోంది. ఎన్నికలు సమీపిస్తుడడంతో ఓటు బ్యాంకు పెంచుకునేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఆయా నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను రెడీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేశారు ఆయా పార్టీల అధినేతలు. దీంతో టీడీపీ తొలి జాబితాలో సీట్లు దక్కించుకున్న నేతలకు చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేశారు. టికెట్లు దక్కాయనే నిర్లక్ష్యం వద్దని, ఎన్నికల్లో గెలుపు కోసం వచ్చే 40 రోజులు చాలా ముఖ్యమని సూచించారు. పనితీరు బాగాలేకపోతే అభ్యర్థుల్ని మర్చడానికి ఏ మాత్రం ఆలోచించనని హెచ్చరించారు. ఎన్నికల వరకు ప్రతివారం ఎప్పటికప్పుడు ఆయా నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తానని అభ్యర్థులకు తెలిపారు. ఈ మేరకు తొలి జాబితాలో సీట్లు దక్కించుకున్న నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టికెట్లు పొందినవారికి శుభాకాంక్షలు తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు ఒక్క పొరపాటు కూడా చేయడానికి వీల్లేదని అన్నారు. ప్రజల్లో తిరుగుతూ ఉండాలని ఒక్క సీటు కూడా ఓడిపోకూడదని తెలిపారు. అసంతృప్తి నాయకులను అభ్యర్థులే కలుపుకొవాలని, అభ్యర్థిననే అహంకారంతో ఉండొద్దని తెలిపారు. ఏ మాత్రం ఏమరపాటు వద్దని ఎంత సీనియర్ నాయకుడైనా చివరి నిమిషం వరకు కష్టపడాలని సూచించారు. టీడీపీ - జనసేన పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తే నూటికి నూరు శాతం ఓట్ల బదిలీ జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలు చేస్తారని..వాటన్నింటికీ సమర్థ వంతంగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. ప్రతి అభ్యర్థి ఒక లాయర్ ను పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. వచ్చే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.3 కోట్ల మంది అభిప్రాయాలు సేకరించామన్నారు. సర్వేలు పరిశీలించాక చాలా ఆలోచించే అభ్యర్థుల్ని ఎంపిక చేశామని తెలిపారు. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసమే టీడీపీ-జనసేన పొత్తుతో పోటీ చేస్తున్నాయని చంద్రబాబు చెప్పారు.




Tags:    

Similar News