ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార - విపక్ష నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా.. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. పొత్తుల నేపథ్యంలో పలువురు టీడీపీ నేతల సీట్లపై సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యం ఇస్తామని బాబు హామీ ఇచ్చారు.
టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పొత్తులు నేపథ్యంలో టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహ పడొద్దని బాబు సూచించారు. పార్టీని నమ్ముకున్న వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు. జగన్ తీరుతో విసిగిపోయిన వైసీపీ నేతలు టీడీపీలో చేరుతామంటున్నారని.. కానీ పార్టీకి పనికొచ్చేవారినే తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాంటి చేరికలను పార్టీ నేతలను ప్రోత్సహించాలని సూచించారు. ‘రా.. కదలిరా’ సభలు ముగిశాక ప్రజాచైతన్య యాత్రను ప్రారంభిస్తానని బాబు తెలిపారు. ఎన్నికలు దగ్గరపడుతున్నందన పార్టీ నేతలు సీరియస్‌గా పనిచేయాలని స్పష్టం చేశారు.