షర్మిలకు చంద్రబాబు స్క్రిప్ట్ ఇచ్చి చదివిస్తున్నారు... Minister Roja
విపక్షాలపై ఫైర్ అయ్యారు మంత్రి రోజా. చంద్రబాబు అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకుంటారని రోజా మండిపడ్డారు. పవన్ కల్యాణ్ మాటలను ప్రజలు నమ్మలేదని..అందుకే షర్మిలకు చంద్రబాబు స్క్రిప్ట్ ఇచ్చి చదివిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు వైజాగ్ లో ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శించిన చంద్రబాబుతో షర్మిల ఎలా కలుస్తున్నారని ప్రశ్నించారు.
వైఎస్సార్‌ను పంచలు ఊడదీసి కొడతామన్నా పవన్‌కు ఎందుకు కలిశారని విమర్శించారు. రేవంత్ అవినీతిపరుడు, టీడీపీ కోవర్ట్ అన్న షర్మిల.. ఆయన్ను ఎలా కలిశారని ప్రశ్నించారు. అలాంటి వారితో చేతులు కలిపి షర్మిల వైఎస్ ఆత్మ క్షోభించేలా చేస్తున్నారని మండిపడ్డారు. వినేవాళ్లు ఎర్రివాళ్లు అయితే చెప్పేవారు షర్మిలని ఎద్దేవా చేశారు. వైఎస్ ఆశయాలకు షర్మిల గంగలో కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ ఆశయాలకు నిజమైన వారసుడు సీఎం జగనే అని తేల్చి చెప్పారు.
షర్మిలవి టైమ్‌పాస్ రాజకీయాలని మంత్రి రోజా విమర్శించారు. సీఎం జగన్‌పై విషయం చిమ్ముతూ, వైఎస్సార్‌సీపీ ఓట్లు విభజించాలన్నదే షర్మిల ఉద్ధేశ్యమని దుయ్యబట్టారు. వైఎస్ జగన్‌ను అధికారంలో నుంచి తప్పించి.. చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడమే వారి ప్లాన్ అని మండిపడ్డారు. అంతేతప్ప ఏపీని అభివృద్ధి చెయ్యాలని గానీ, ప్రజలకు మంచి చెయ్యాలన్న ఆలోచనే వారికి లేదని మంత్రి రోజా తెలిపారు.