Chandrababu Naidu : జగన్ ఏపీకి పట్టిన శని.. వాలంటీర్లకు బాబు హెచ్చరిక
టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏపీకి పట్టిన శనిగ్రహం అని, జగన్‌ను నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకు పోవాల్సిందేనని హెచ్చరించారు. నేడు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో 'రా కదలిరా సభ' నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ.. తిరుపతిలోని ఏడుకొండల వెంకన్న స్వామిని రాజకీయాలకు, పైరవీలకు వాడుకుంటున్నారని, తిరుపతిని దొంగ ఓట్ల కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు. ఏపీలో ఓట్ల దొంగలు పడ్డారని, ఆన్‌లైన్‌లో ఓట్లను మాయం చేస్తున్నారని అన్నారు.
చిత్తూరులో ఓ ఎర్రచందనం స్మగ్లర్‌కు ఎమ్మెల్యే సీటు ఇచ్చారని, ఆ పాపాల పెద్దిరెడ్డిని మళ్లీ మళ్లీ హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదని చంద్రబాబు అన్నారు. కాంట్రాక్టులు, ఎమ్మెల్యేలు, స్మగ్లర్లు, దొంగలు అంతా వారేనన్నారు. పెద్దిరెడ్డి డైరీకే పాలు పోయాలా అని ప్రశ్నించారు. రెండు నెలల్లో తిన్నది అంతా కక్కిస్తానని చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
వైసీపి సిద్ధం అనే పేరుతో వస్తోందని, అసలు ఆ నాయకులంతా దేనికి సిద్ధమో చెప్పి తీరాలన్నారు. పెరిగిన ధరలు, పారిపోయిన కంపెనీలను అందరూ గుర్తు చేసుకోవాలన్నారు. జగన్‌ను నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకు పోతారని, వాలంటీర్లు వైసీపీకి సేవ చేస్తే మాత్రం ఖబడ్దార్ అంటూ చంద్రబాబు వారికి వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల్లో ప్రజలంతా బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాక్ అవ్వాలని, జగన్‌ను ఇంటికి పంపించాలని చంద్రబాబు కోరారు.