ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ అయ్యారు. అమిత్ షా నివాసంలోనే ఈ సమావేశం జరిగింది. ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం హస్తినకు వెళ్లిన చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఈ భేటీలో ఏం చర్చించారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో పలు అధికారిక కార్యక్రమాల్లో మోదీని పలకరించిన బాబు.. తాజాగా మరోసారి బీజేపీ పెద్దలతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది.
ప్రత్యేక హోదా డిమాండ్‌తో 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. తర్వాత బీజేపీపై పోరాటానికి దిగారు. దీంతో ఇరు పార్టీల మధ్య దూరం పెరిగింది. అయితే ఇటీవల కాలంలో టీడీపీ, బీజేపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ భేటీ ఆసక్తికరంగా మారింది.