స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్లపై గురువారం ఉదయం 11గంటలకు వాదనలు వింటామని న్యాయమూర్తి ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి బెయిల్, కస్టడీ పిటిషన్లపై కోర్టులో హోరాహోరీ వాదనలు జరిగాయి.
చంద్రబాబు తరఫున అడ్వొకేట్ ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ఎలాంటి తప్పిదాలు చేయలేదని కోర్టుకు విన్నవించారు. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి గుజరాత్ వెళ్లి అధ్యయనం చేసిన తర్వాతే కేబినెట్ ఆమోదం లభించిందని చెప్పారు. కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీలో చంద్రబాబు లేరని, అందులో సభ్యుడైన భాస్కరరావు ప్రస్తుతం తాత్కాలిక బెయిల్ పై బయట ఉన్నారని దూబే ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కనీసం కండీషన్ బెయిల్ అయినా ఇవ్వాలని కోర్టును కోరారు. పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని విదేశాలకు పారిపోవడానికి చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని విన్నవించారు.
అనంతరం సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సీమెన్స్ కంపెనీ పేరుతో స్కిల్ స్కాంకు పాల్పడ్డారన్న ఆయన.. కేబినెట్ ఆమోదంతో ఎంఓయూ జరిగిందనడం అవాస్తవమని కోర్టుకు విన్నవించారు. విదేశాలకు పారిపోయిన బాబు మాజీ పీఏ శ్రీనివాస్ పాస్పోర్ట్ సీజ్ చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే ఆయన సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశముందని, అందుకే ఆ పిటిషన్ డిస్మిస్ చేయాలని సుధాకర్ రెడ్డి కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను గురువారానికి వాయిదా వేశారు.