Chandrababu Naidu : టీడీపీ హామీల వర్షం..సైకో పాలన అంతం చేయాలన్న బాబు

Update: 2024-02-05 10:26 GMT

వైసీపీని బంగాళాఖాతంలో కలిపి, సైకో పాలనను అంతం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. విశాఖను గంజాయికి కేంద్రంగా మార్చారని, జగన్ తన సొంత పత్రిక అయిన సాక్షికి వేల కోట్లు దోచిపెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు హైదరాబాద్‌లో గంజాయి అమ్ముతూ దొరికిపోయినట్లు తెలిపారు. అనాకపల్లి జిల్లా మాడుగులలో టీడీపీ ఆధ్వర్యంలో సభను నిర్వహించారు.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ ప్రజలకు న్యాయం చేసే బాధ్యత తనదేనన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నిరుద్యోగికి కూడా ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతిని అందిస్తామన్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 అందిస్తామన్నారు. తల్లికి వందనం పేరుతో పిల్లలకు రూ.15 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం

మహిళల కోసం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందిస్తామన్నారు. అదేవిధంగా మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హొమ్ అవకాశం కల్పిస్తామని, రైతును రాజుగా చేసి ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇస్తామన్నారు. అమరావతి మన రాజధాని అని, అలాగే విశాఖ మన ఆర్థిక రాజధాని అని చంద్రబాబు అన్నారు. రాజకీయాల్లో ఏబీసీడీలు రాని జగన్‌ను తరిమేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.


Tags:    

Similar News