Chandrababu Naidu : 'ఓ దుర్మార్గుడికి రాష్ట్రాన్ని అప్పగిస్తే'.. సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన కామెంట్స్
వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి పోయిందని.. మళ్లీ కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని జగన్ దెబ్బతీశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 'వ్యవసాయ శాఖను మూసేశారు.. ధాన్యం రైతులు దగాపడ్డారు. అప్పుల్లో రాష్ట్ర రైతులు అగ్రస్థానంలో ఉన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా కదలి రావాలని' పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన ‘రా.. కదలి రా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
‘‘ఓ పక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే.. మరో పక్క అమరావతి వెలవెలబోతోంది. దీనికి కారణం జగన్ రివర్స్ పాలన. ఓ వ్యక్తి వల్ల ఒక రాష్ట్రం.. ఒక తరం ఇంతగా నష్టపోయిన పరిస్థితి ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఒక అసమర్థుడు అధికారంలోకి వస్తే కొంతవరకు.. ఓ దుర్మార్గుడికి అప్పగిస్తే తిరిగి కోలుకోలేని విధంగా నష్టపోతాం. రాష్ట్రంలో నాతో సహా అందరూ బాధితులే. ప్రజాస్వామ్యంలో నిద్ర లేని రాత్రులు గడిపాం. అరాచక పాలనకు చరమగీతం పాడాలని కోరుతున్నా’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ''ప్రపంచంలో తెలుగుజాతి నంబర్ వన్‌గా ఉండాలనేది నా ఆకాంక్ష. తెలుగు ప్రజలు ప్రపంచ రాజకీయాల్లో రాణించే పరిస్థితి వస్తుంది. తెలుగుజాతి గ్లోబల్ నాయకులుగా ఎదిగేందుకు TDP ఉపయోగపడిందని చంద్రబాబు అన్నారు.