తనది విజన్ అయితే జగన్‌ది పాయిజన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో జగన్పై బాబు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలు సిద్ధం పేరుతో ప్రజల ముందుకు వస్తున్నారని.. మేము వైసీపీని భూస్థాపితం చేయడానికి సిద్ధమని అన్నారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది తన ఆశయమని.. ప్రజలకు బంగారు భవిష్యత్తు అందించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. అమరావతి నిర్మిస్తే.. ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని అభిప్రాయపడ్డారు.
రివర్స్ నిర్ణయాలతో ఏపీలో రివర్స్ పాలన సాగుతోందని చంద్రబాబు విమర్శించారు. అమరావతి రాజధానిని జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను తామే తీసుకుంటామన్నారు. పేద పిల్లల చదువు కోసం విదేశీ విద్య అందించడం, దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ, రైతు బిడ్డలను లక్షాధికారులను చేయడం వంటివి టీడీపీ మార్క్ అని చెప్పారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారని.. ఆ పార్టీని భూస్థాపితం చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.