Chndrababu Health Issue : చంద్రబాబుకు అనారోగ్యం.. బయటకు వచ్చిన డాక్టర్ల రిపోర్ట్
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యుల నివేదిక బయటకు వచ్చింది. చంద్రబాబు ఛాతీ, చేతులు, మెడ, గడ్డం, వీపు తదితర శరీరభాగాల్లో దద్దుర్లు, స్కిన్ అలర్జీ వచ్చినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈనెల 12న సాయంత్రం 4.30గంటలకు జీజీహెచ్ సూపరింటెండెంట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అదే రోజు సాయంత్రం 5 నుంచి 5.30గంటల వరకు పరీక్షించి.. జి.సూర్యనారాయణ, వి.సునీతదేవిలతో కూడిన డాక్టర్ల బృందం జైలు అధికారులకు నివేదిక అందజేసింది. చంద్రబాబు డీహైడ్రేషన్ సమస్యతో కూడా బాధపడుతున్నారని, దానివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఆయనను చల్లని వాతావరణంలో ఉంచేలా చూడాలని జైలు అధికారులకు వైద్యులు సూచించారు. చంద్రబాబుకు ఐదు రకాల మందులు సిఫార్సు చేశారు.
ఇదిలా ఉంటే జైలు అధికారులు, ప్రభుత్వ అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా వైద్యుల నివేదిక ఉంది. జైలు అధికారులు చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని చెబుతుండగా.. ప్రభుత్వ డాక్టర్ల నివేదిక మాత్రం దానికి భిన్నంగా ఉంది. 12న చంద్రబాబును పరీక్షించిన ప్రభుత్వ వైద్యులు.. 13న జైలు అధికారులకు రిపోర్ట్ ఇచ్చారు. డాక్టర్లు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా జైలు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చంద్రబాబు కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.