తేడా వస్తే అభ్యర్థులను మారుస్తా..వారికి చంద్రబాబు వార్నింగ్

Byline :  Shabarish
Update: 2024-02-25 11:47 GMT

మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో టీడీపీ, జనసేన కూటమి అధికార వైసీపీ పార్టీని గద్దె దింపేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. తాజాగా తొలి జాబితాను కూడా ప్రకటించింది. మొత్తం 118 మందితో చంద్రబాబు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. అందులో 24 సీట్లను జనసేన అభ్యర్థులకు కేటాయించారు. మిగిలిన సీట్ల గురించి మరో సమావేశంలో చెబుతామని తెలిపారు. టీడీపీ, జనసేన కూటమి విడుదల చేసిన తొలి జాబితాపై వైసీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారికి ధీటుగా జనసేన నేత పవన్ కూడా కామెంట్స్ చేశారు.

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తొలి జాబితాలో సీట్లు పొందినవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నేడు ఆయన సీట్లు పొందిన అభ్యర్థులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఎన్నికల వరకూ ప్రతి రోజూ చేపట్టాల్సిన పనులపై చర్చించారు. వచ్చే 40 రోజుల్లో అభ్యర్థులు నిత్యం ప్రజల్లో ఉండాలన్నారు. అభ్యర్థుల పనితీరుపై ప్రతివారం సర్వే చేస్తామని, ఆ సర్వేల్లో తేడా వస్తే ఆ ప్రాంత అభ్యర్థులను మార్చేందుకు కూడా వెనకాడబోమని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

ప్రజలకు నమ్మకం కలిగించాలని, వైసీపీ ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టాలని టీడీపీ అభ్యర్థులకు సూచించారు. జగన్‌పై అసంతృప్తిగా ఉన్న వైసీపీ నేతలను టీడీపీలోకి ఆహ్వానించాలని దిశానిర్దేశం చేశారు. అలాగే జనసేన కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటర్ల ఇళ్లకు వెళ్లి మాట్లాడాలన్నారు. ఎన్నికల్లో ఊహించని స్థాయిలో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడతారని, వాటన్నింటికీ టీడీపీ అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు.



Tags:    

Similar News