తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఇటీవల జనసేన నేత కొట్టే సాయిపై సీఐ అంజూయాదవ్ చేయి చేసుకొని వార్తల్లో నిలిచారు. ఆందోళన చేస్తున్న జనసేన నాయకుడి చెంప చెళ్లుమనిపించడం వివాదానికి దారి తీసింది. అంజూయాదవ్ పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీకాళహస్తి పట్టణ సీఐ తీరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పు బట్టారు. సీఐ అంజూయాదవ్ తీరుకు నిరసనగా పవన్ కల్యాణ్ సోమవారం తిరుపతి వెళ్లి జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేయనున్నారు.
ఏపీలో పోలీస్ శాఖ కూడా అంజూయాదవ్ పై చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఛార్జ్ మెమో జారీ చేసినట్టు సమాచారం. అంజుయాదవ్ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి విచారణ జరిపి డీజీపీకి నివేదిక సమర్పించారు.
మరో వైపు జనసేన నేత కొట్టే సాయిపై సీఐ అంజూయాదవ్ చేయి చేసుకున్న ఘటనపై మానవహక్కుల సంఘం విచారణకు ఆదేశించింది. . ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల సంఘం..సీఐ అంజూయాదవ్ సహా పదిమంది ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేశారు.ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరిపి ఈనెల 27న నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.