CM Jagan : పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ సెటైర్లు
జనసేన నేత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయంపై మరోసారి సెటైర్లు వేశారు (CM Jagan) ఏపీ సీఎం జగన్. గురువారం కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో లబ్దిదారులకు.. జగన్ ఇళ్ల పట్టాలను అందించారు. ఆ తర్వాత వారితో కలిసి సామూహిక గృహా ప్రవేశాలను చేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ.. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల అంశంపై మాట్లాడారు. ఒకసారి లోకల్, మరోసారి నేషనల్, ఇంకోసారి ఇంటర్నేషనల్ అంటూ పవన్ పెళ్లాడిన మహిళల గురించి సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు.
వివాహ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ గౌరవం లేదని, దత్త పుత్రుడి ఇల్లు హైదరాబాద్ లో ఉన్నా.. ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతీ మూడేళ్లకు మారిపోతుంటారని అన్నారు. ఆడవాళ్లు, పెళ్లిళ్ల వ్యవస్థపై ఆయనకు ఉన్న గౌరవం ఏంటో ప్రజలు ఆలోచించాలని సూచించారు. నాయకులని చెప్పుకుంటున్న వారే భార్యలను మారిస్తే ఎలా అంటూ కౌంటర్ వేశారు. నియోజకవర్గాలను కూడా వాడుకోవడం, వదిలేయడం గానే పవన్ భావిస్తాడని సీఎం జగన్ మండిపడ్డారు. ప్యాకేజీ స్టార్ కు గాజువాక, భీమవరంతో సంబంధం లేదని విమర్శలు చేశారు.
సరుకులను అమ్ముకొనే వాళ్లను చూశాం.. కానీ స్వంత పార్టీని, స్వంత వర్గాన్ని అమ్ముకొనే వాళ్లను ఇప్పుడే చూస్తున్నామని అన్నారు. అభిమానుల ఓట్లను హోల్ సేల్ గా అమ్ముకొనేందుకే ప్యాకేజీ స్టార్ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. రెండు షూటింగ్ ల మధ్య అప్పుడప్పుడు రాష్ట్రానికి వస్తాడని.. ప్యాకేజీ స్టార్‌కు మనపై ఎంత ప్రేమ ఉందో కాపులు కూడా ఆలోచించాలని సూచించారు. రాష్ట్రంపై ప్రేమ లేని వాళ్లు రాష్ట్రం గురించి ఊగిపోతున్నారన్నారు.