చంద్రముఖి సైకిల్ ఎక్కి టీ గ్లాస్తో ప్రజల రక్తం తాగడానికి వస్తోంది : Jagan
వైసీపీ పాలన కొనసాగాలంటే ప్రజలు రెండు బటన్లు నొక్కాలని జగన్ అన్నారు. ఒక బటన్ నొక్కి అసెంబ్లీకి.. రెండో బటన్ నొక్కి పార్లమెంట్కు వైసీపీని భారీ మెజార్టీతో పంపించాలని కోరారు. రాప్తాడు సిద్ధం సభలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ బయట ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ సింకులో ఉండాలని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రముఖి సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకుని ప్రజల రక్తం తాగడానికి వస్తున్నారని మండిపడ్డారు.
అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. 2014లో 650 హామీలిచ్చి.. 10శాతం కూడా అమలు చేయలేదని ఆరోపించారు. కానీ తాము 2019లో ఇచ్చిన హామీల్లో 99శాతం అమలు చేశామన్నారు. గత ఐదేళ్లలో ఎన్నో మంచి పనులు చేశామన్న సీఎం.. ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే ఇంకెన్నో చేస్తామని చెప్పారు. ఈ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం లంచం లేకుండా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.
మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదని.. ప్రజలతోనే పొత్తు అని జగన్ అన్నారు. జగన్కు ప్రజాబలం లేకపోతే చంద్రబాబుకు పొత్తులెందుకు అని ప్రశ్నించారు. సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు అని నిలదీశారు. చంద్రబాబు రంగురంగుల మేనిఫేస్టోను ప్రజలు నమ్మరని జగన్ అన్నారు. చంద్రబాబు మోసాలకు విసుగు చెందిన ప్రజలు టీడీపీ కుర్చీలు మడచి 23కు తగ్గించారని సెటైర్ వేశారు. మరోసారి చొక్కా మడతపెట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అసెంబ్లీలో 175కు 175, లోక్ సభలో 25కు 25 ఎంపీ సీట్లు గెలవడమే తమ టార్గెట్ అని స్పష్టం చేశారు.