Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు..విచారణకు హాజరుకావాలని నోటిసులు

Byline :  Vinitha
Update: 2024-02-18 01:46 GMT

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నవేళ అధికార పార్టీ, ప్రతిపక్షాలు పోటీపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసు దాఖలు చేసింది. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో...గుంటూరు కోర్టులో కేసు వేసింది. దీంతో విచారణకు స్వీకరించిన కోర్టు 499, 500, ఐపీసీ సెక్షన్ల కింద పవన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసి నాలుగో అదనపు జిల్లా కోర్టుకు ట్రాన్స్ ఫర్ చేసింది. మార్చి 25న జనసేనాని విచారణకు హాజరుకావాలని నాలుగో అదనపు జిల్లా కోర్టు జడ్జి నోటీసులు పంపించారు. గతేడాది జులై 9న ఏలూరులో జరిగిన వారాహి యాత్రలో జనసేనాని సెంట్రల్ ఇంటిలిజెన్స్ సమాచారం మేరకు రాష్ట్రంలో సుమారు 29వేల నుంచి 30వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని చెప్పారు. అంతేగాక వారిలో 14 వేల మంది తిరిగి వచ్చినట్లు పోలీసులు చెప్పిన..మిగిలినవారి గురించి సీఎం ఎందుకు ఆరా తీయడం లేదని ప్రశ్నించారు. డీజీపీ కూడా కనీసం సమీక్షించలేదని ఆయన ప్రస్తావించారు.

వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కుటుంబంలోని ఒంటరి మహిళలను గుర్తించి కొంతమంది సంఘ విద్రోహశక్తుల ద్వారా వల వేసి ఎత్తుకెళ్తున్నారని పవన్ ఆరోపించారు. ఇందులో వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దల హస్తమున్నట్లు సెంట్రల్ ఇంటిలిజెన్స్ వర్గాలు తనకు చెప్పినట్లు పవన్ అప్పట్లో తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ప్రభుత్వం కేసు దాఖలు చేసింది. వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రభుత్వంపై బురదజల్లేలా పవన్‌ మాటలు ఉన్నాయని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టులో ఫిర్యాదు చేశారు.




Tags:    

Similar News